: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన సీఐ కారు, ఇద్దరు మృతి
శుక్రవారం పొద్దున్నే వారంతా బస్సు కోసం ఎదురుచూస్తూ బస్టాండ్ లో నిలబడ్డారు. ఇంతలో కళ్లు మూసి తెరిచేలోగా ఓ కారు వారిపైకి దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రయణికులపైకి దూసుకొచ్చిన కారు ఓ సీఐది కావడంతో అక్కడ కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రం అక్బర్ నగర్ లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాన్సువాడ రూరల్ సీఐ వెంకట రమణారెడ్డి కారు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాలను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేశారు.