: నేడు ప్రధాని మోడీతో ఫేస్ బుక్ అధిపతి భేటీ
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ నేడు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్ వచ్చిన జుకెర్ బర్గ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ‘‘డిజిటల్ ఇండియా నినాదంతో ముందుకెళుతున్న మోడీ నిజంగా మమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తున్నారు. మేము కేవలం ఒక కంపెనీకి చెందిన వారమే. ప్రపంచ వ్యాప్తంగా కనెక్టివిటీని మేము మాత్రమే పూర్తి చేయడం అసాధ్యమే. దీంతో దీనిపై పనిచేస్తున్న వివిధ దేశాలకు చెందిన వారితో పని చేయాలనుకుంటున్నాం. ఈ క్రమంలో తమ దేశ ప్రజలందరికీ నెట్ సౌకర్యం కల్పించాలని భావిస్తున్న ప్రభుత్వాలతో పనిచేయాలనుకుంటున్నాం. ప్రధాని మోడీతో భేటీలో మేము ఏం అడగాలనుకుంటున్నామో చెప్పమంటున్నారు. అయితే మేము ఆయనను ఏమీ అడగటం లేదు. ఈ దిశగా ఆయన చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించనున్నాం’’ అని జుకెర్ బర్గ్ గురువారం మీడియాతో వ్యాఖ్యానించారు.