: నిన్న చంద్రబాబుకు సన్నిహితుడు, ఇవ్వాళ కేసీఆర్ కు స్నేహితుడు!


రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. నిన్నటి శత్రువు... ఇవ్వాళ మిత్రుడు కావచ్చు. అలాగే, నిన్నటి స్నేహితుడు, ఈరోజుకి శత్రువు అయిపోవచ్చు. రాజకీయాల్లో శాశ్వత సంబంధాలు, అనుబంధాలు చాలా తక్కువని చరిత్ర చెబుతున్న సత్యం. ఇదంతా చెబుతున్నది వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి గురించి! తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్ ఎమ్మెల్యే), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం ఎమ్మెల్యే), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్ ఎమ్మెల్యే), ధర్మారెడ్డి (పరకాల ఎమ్మెల్యే) టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిలో, ధర్మారెడ్డి టీఆర్ఎస్ లోకి వెళతారని ఎవరూ ఊహించలేకపోయారు. ఆయన నిర్ణయం టీడీపీ వర్గాలతో పాటు విలేకరులను సైతం ఆశ్చర్యానికి గురిచేేసింది. గత కొంతకాలంగా, ధర్మారెడ్డి చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా నిలిచారు. కొన్ని రోజుల క్రితం ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లోకి వెళుతున్నారనే విషయాన్ని ఆయన ద్వారానే టీడీపీ వర్గాలు మీడియాకు లీక్ చేశాయి. తనను కూడా టీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా ఎర్రబెల్లి ఆహ్వానించారని, అయితే ఈ ప్రతిపాదనను తాను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చానని ఆయన ప్రకటించారు. టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొంది, టీఆర్ఎస్ లోకి వెళ్లడం అనైతికమని... తాను జీవితాంతం టీడీపీలో్నే కొనసాగుతానని ఆయన విలేకరులకు అధికారంగా, అనధికారికంగా స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా, నిన్ననే విలేకరులు సమావేశంలో కేసీఆర్ పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ కు పరిపాలించడం చేతకాదనీ, ప్రతీదానికి చంద్రబాబును విమర్శించడం సరికాదని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కరెంట్ విషయంలో కేసీఆర్ కేంద్రాన్ని సంప్రదించలేదని, తెలంగాణలో రైతులు కరెంట్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్నా భేషజాలకు పోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా విద్యుత్ కోసం రిక్వెస్ట్ చేయలేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాము బస్సుయాత్ర చేపడుతున్నామని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. అయితే, నిన్న కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించిన ధర్మారెడ్డి ఈ ఉదయం కేసీఆర్ ను కలిసిన తర్వాత హఠాత్తుగా టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయంచుకోవడం, తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నానని అనడం విలేకరులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరనే విషయాన్ని వారు గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News