: టీడీపీలో లోకేశ్ పై పెరుగుతున్న నిరసన గళాలు!


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ పై పార్టీలో నానాటికీ అసంతృప్తి రాగాలు పెరిగిపోతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లోనే కాక ఇటు తెలంగాణలోనూ లోకేశ్ తీరుపై నేతలు నొసలు చిట్లిస్తున్నారు. చంద్రబాబు ఏకైక సంతానమైన లోకేశ్, అమెరికాలో విద్యాభ్యాసం తర్వాత, గడచిన ఎన్నికల సందర్భంగా తండ్రికి చేదోడువాదోడుగా నిలిచారు. పలు కీలక అంశాలపై పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏపీలో పార్టీ విజయంలో ఆయనది కొంత పాత్ర ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఎన్నికలు ముగిసి ఏపీలో అధికారం చేపట్టడం, తెలంగాణలో ప్రతిపక్ష హోదా సంపాదించడం... ఇలా పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. అయితే తాజాగా లోకేశ్ వ్యవహార సరళిపై ఇరు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలు లోలోపల రగిలిపోతున్నారు. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి, వెంటనే తెలంగాణ పార్టీ పగ్గాలు చేపడతామంటే, తామంతా పనికిరానివారమనేగా మీ ఉద్దేశ్యమంటూ సతన్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బహిరంగంగానే తన బాధను వెళ్లగక్కారు. మరోవైపు రెవెన్యూ శాఖ బదిలీలకు సంబంధించి లోకేశ్ చేసిన ఫిర్యాదుతో చంద్రబాబు స్పందించిన తీరుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లోలోపల రగిలిపోతున్నారు. భవిష్యత్తులో లోకేశ్ వల్ల మరిన్ని కొత్త సమస్యలు వచ్చిపడే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News