: మీరే ప్రయత్నం చేసుకోకుండా, నన్నంటే ఏం ఉపయోగం?: కేసీఆర్ కు బాబు జవాబు
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతకు ఎటువంటి ప్రయత్నం చేయకుండా, తనను ఆడిపోసుకుంటే ఏ ప్రయోజనమూ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నెల రోజుల్లోపు నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లి విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ను, సంబంధిత ఉన్నతాధికారులను కలసి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అవసరాలను గురించి మాట్లాడానని, నిరంతర విద్యుత్ సరఫరాకు ఏపీని ఎంపిక చేసేదాక తాను పట్టువదలకుండా ప్రయత్నించానని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ లో బొగ్గు కొరతను దృష్టిలో ఉంచుకుని, విదేశాల నుంచి బొగ్గు దిగుమతిని పెంచామని, దీంతో ధర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి 65 శాతం నుంచి 85 శాతానికి పెరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, సంబంధిత మంత్రులకు తనను వచ్చి కలవడానికి కూడా తీరిక లేదని స్వయంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఏ పని చేయకుండా, తనను తిడితే ఏం ఉపయోగం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తన బాధ్యతగా ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి తెలంగాణలో విద్యుత్ సమస్య గురించి కేంద్రానికి వివరిస్తూ వచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మిగులు విద్యుత్ ఉంటే ముందుగా తెలంగాణకే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.