: రూ. 100 కోట్ల జరిమానా విధింపు నిరంకుశమే: జయలలిత
అక్రమాస్తుల కేసులో తనపై రూ.100 కోట్ల జరిమానా విధించడంలో పరప్పన అగ్రహార కోర్టు నిరంకుశంగా వ్యవహరించిందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆరోపించారు. ఈ కేసులో న్యాయమూర్తి వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పేర్కొన్న అక్రమాస్తుల కంటే రెండింతలు జరిమానా విధించడం నిరంకుశమైన తీర్పు కాక మరేమిటని ఆ పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. ఈ తరహా జరిమానాలను న్యాయమూర్తి విధించాల్సి ఉండింది కాదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు ద్వారా న్యాయమూర్తి నిష్పాక్షికంగా వ్యవహరించినట్లు తాను భావించడం లేదని తెలిపారు. భారీ జరిమానా విధించిన న్యాయమూర్తి పొరపాటు చేశారని కూడా ఆమె తన అప్పీలులో పేర్కొన్నారు. అక్రమాస్తుల గణాంకాల్లోనూ కోర్టు సవ్యంగా వ్యవహరించలేదని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వానికి తాను రూ.5 కోట్లు చెల్లించాలన్న తీర్పుపైనా జయలలిత అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణకయ్యే ఖర్చును నిందితుల నుంచి ఎలా సేకరిస్తారని జయలలిత ప్రశ్నించారు.