: దూసుకొస్తున్న'హుదూద్' తుపాను... ఏపీకి పెనుముప్పు
హుదూద్ తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. దీంతో, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నెల 12న విశాఖపట్నం-గోపాల్ పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ తుపాను విశాఖకు ఆగ్నేయ దిశలో 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయిందని ప్రకటించింది. ఈ తుపాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. తుపాను నేపథ్యంలో, విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని జిల్లా కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు. హుదూద్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో, తీర ప్రాంత అధికారులను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది.