: మార్చి 31లోగా 'గంగ' పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ వ్యవస్థలు: కేంద్రం
గంగానది ప్రక్షాళనలో భాగంగా, నదీ పరిసరాల్లో ఏర్పాటైన పరిశ్రమలన్నీ వచ్చే ఏడాది మార్చి 31 లోగా కాలుష్య నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించని పరిశ్రమలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి హెచ్చరించారు. ఈ మేరకు ఆమె బుధవారం స్పష్టమైన విధివిధానాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. ఆయా పరిశ్రమలను మార్చి 31 నుంచి ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ తరహా కాలుష్యాల విడుదలకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తరహాలో కాలుష్య నియంత్రణ వ్యవస్థలను సదరు పరిశ్రమలు మార్చి 31లోగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో సదరు పరిశ్రమలను మూసివేసేందుకు కూడా వెనుకాడకూడదనేది ప్రభుత్వ సంకల్పం. గంగను తల్లిగా, పరిశ్రమలను పిల్లలుగా పరిగణించిన మంత్రి, తల్లీబిడ్డల్లో ఎవరికి ఓటేస్తారంటే, తాను మాత్రం తల్లి (గంగ) వైపేనంటూ ఉమా భారతి ప్రకటించారు. తల్లి పాలు తాగే బిడ్డ, తల్లి మనుగడనే ప్రశ్నార్థకంగా మారిస్తే, చూస్తూ ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు.