: వెయ్యి వారాలుగా ఆడుతున్న సినిమాను ఎత్తేస్తున్నారు
వెయ్యి వారాలుగా ముంబయ్‌లోని ‘మరాఠా మందిర్’ సినిమా థియేటర్లో ఆడుతున్న సినిమాను ఎత్తేసి, కొత్త సినిమాను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముంబయ్‌లోని సెంట్రల్ రైల్వేస్టేషన్‌కీ, బస్టాండ్‌కి అతి చేరువలో ఉన్న ‘మరాఠా మందిర్’ సినిమా హోలుకు ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే’ సినిమా ప్రత్యేకతను తీసుకొచ్చింది. 1995 అక్టోబర్ 20న షారుక్‌ఖాన్, కాజల్ జంటగా ఆదిత్యచోప్రా దర్శకత్వంలో యాష్‌చోప్రా నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అప్పటి నుంచి నేటి వరకు ముంబయిలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ఆడుతూనే ఉంది. అంటే సరిగ్గా ఈ నెల 20కి ఆ సినిమా ఆ థియేటర్‌లో 19 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ‘దిల్‌వాలే దిల్హనియా లేజాయింగే’ చిత్రం ఆ థియేటర్లో విడుదలైనప్పుడు ఆ సినిమా చూసిన వారు, దాని ప్రేరణతో ప్రేమలో పడ్డ జంటలు, పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కన్నారు. వాళ్లకి పెళ్లీడు కూడా వచ్చేసింది. అయినప్పటికీ ‘డీడీఎల్’ మాత్రం ఆ థియేటర్ నుంచి మారలేదు. నేటికీ ఆ ధియేటర్ లో ప్రదర్శించబడుతూనే ఉంది. ఇప్పుడు విడుదలైన సినిమాలు థియేటర్లో వారం రోజులు నిలవడమే గగనమైపోతోంది. వారం తిరక్కుండానే టీవీలో వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కాదంటే డీవీడీలు కూడా వచ్చేస్తున్నాయి. వాటన్నింటినీ తోసి రాజని ఏకంగా 1000 వారాలు ఏకధాటిగా ప్రదర్శితమైన ఏకైక సినిమా ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే’. ‘డీడీఎల్’ సినిమాది మరాఠా మందిర్ తో పాటు ఓ చరిత్ర. చెరగని, తిరుగులేని, తిరిగి రాని చరిత్ర. భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర. ఈ నెల 20కి ‘డీడీఎల్’ 20వ ఏట అడుగుపెట్టబోతోంది. ఇప్పటికి ఈ సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టాయని చెప్పిన ధియేటర్ యాజమాన్యం, సినిమాను మార్చనున్నామని ప్రకటించింది. సినిమా చివరి షోను థియేటర్లో ఘనమైన వేడుకగా నిర్వహించనున్నామని థియేటర్ యాజమాన్యం తెలిపింది. ఈ వేడుకకు 'డీడీఎల్' యూనిట్ మొత్తం రానుండడం విశేషం.