: బౌలర్లకు మురళీధరన్ విజ్ఞప్తి


ఇటీవలి కాలంలో అక్రమ బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్న బౌలర్లపై ఐసీసీ కొరడా ఝుళిపించడం తెలిసిందే. అజ్మల్, నరైన్ వంటి విఖ్యాత స్పిన్నర్లకూ ఐసీసీ నియమావళి సెగ తప్పలేదు. ఈ నేపథ్యంలో నిబంధనలకు లోబడి బౌలింగ్ చేయాలంటూ శ్రీలంక ఆఫ్ స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అన్ని దేశాల బౌలర్లకు విజ్ఞప్తి చేశాడు. మోచేయిని పరిమిత స్థాయికి మించి వంచరాదన్న నిబంధన ఎప్పటి నుంచో అమల్లో ఉందని, అయితే, మ్యాచ్ లో ఓ బౌలర్ యాక్షన్ పై అనుమానం వస్తే అతడిని అడ్డుకునే అధికారం అంపైర్లకు లేదని, మ్యాచ్ అనంతరం వారు రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించాడు. తాను కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొన్నానని, తనకూ బయో మెకానికల్ పరీక్షలు నిర్వహించారని ఈ లంక దిగ్గజం తెలిపాడు. బౌలింగ్ చేసేటప్పుడు 15 డిగ్రీల కంటే ఎక్కువగా మోచేతిని వంచితే అది నిబంధనలకు విరుద్ధం. 1995లో ఆస్ట్రేలియన్ అంపైర్ డారిల్ హెయిర్ మురళీధరన్ విసిరే బంతులు అభ్యంతరకరమంటూ నోబాల్స్ ప్రకటించడం వివాదాస్పదమైంది. అప్పటినుంచి ఆసీస్ అంపైర్లు మురళీధరన్ పై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. ఆనాటి ఘటన ఓ రకంగా శ్రీలంక జట్టులో కసి రేకెత్తించిందని చెప్పవచ్చు. మురళీని 'చకర్' అని అందరూ వేలెత్తిచూపడంతో, అర్జున రణతుంగ నాయకత్వంలోని లంక జట్టు మాత్రం మద్దతుగా నిలిచింది. లంకేయులు అదే కసితో 1996 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించారు. ఈ వరల్డ్ కప్ ఉపఖండం వేదికగా జరిగింది. ఫైనల్లో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన రణతుంగ నిర్ణయాన్ని తప్పుబట్టినవారు, లక్ష్యఛేదనలో ఈ లంక సారథి విన్నింగ్ షాట్ కొట్టగానే ఆకాశానికెత్తేశారు.

  • Loading...

More Telugu News