: ఆ ఏడుపులన్నీ... గ్లిజరిన్ చుక్కల ప్రభావమేనట!
పురచ్చితలైవి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో రెండోసారి పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు. అయితే అమ్మ జైలు పాలు కావడంపై పన్నీర్ సెల్వంతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణస్వీకారం సందర్భంగా కన్నీరు మున్నీరయ్యారు. అమ్మపై వారికెంత ప్రేమో అంటూ సానుభూతి వ్యక్తమైంది. అయితే ఆ ఏడుపంతా ఉత్తుత్తిదేనని, ఆ కన్నీరంతా గ్లిజరిన్ చుక్కల ప్రభావమేనని తాజాగా వెలుగుచూసింది. జయలలిత జైలుపాలు కావడంతో సీఎంగా కొనసాగేందుకు అనర్హులయ్యారు. ఆమెతో పాటు కేబినెట్ కూడా రద్దు కావడం ఖాయమేగా. ఇంకా బోలెడంత సమయముంది, అప్పుడే పదవులు పోతే ఎలాగంటూ పన్నీర్ సెల్వం సహా మంత్రులంతా దిగాలు పడ్డారు. ఊహించని విధంగా సీఎం పీఠంపై కూర్చోవాలంటూ పన్నీర్ ను జయ ఆదేశించడంతో ఒక్కసారిగా సీను మారిపోయింది. గతంలో కొనసాగిన మంత్రులతోనే పాలన సాగించాలని ఆమె సెల్వంకు చెప్పారు. దీంతో వారిలో ఒక్కసారిగా ఆనందం కట్టలు తెంచుకుంది. అయితే బహిరంగంగా బయటపడితే పదవులకే ప్రమాదం. ఏం చేయాలి? ప్రమాణ స్వీకారం సందర్భంగా కాస్త కన్నీరు కారిస్తే సరిపోతుందిగా అనుకున్నారట. పథకం ప్రకారం ప్రమాణం సందర్భంగా పన్నీర్ సహా మంత్రులందరూ ఏడుపందుకుని నాటకాన్ని రక్తి కట్టించారు. సాయంత్రం కాగానే అనుచర గణంతో స్టార్ హోటళ్లలో చేరి సంబరాల్లో మునిగితేలారు. ఈ విషయం తెల్లారేలోగానే జయలలితకు తెలిసిపోయింది. ఇంకేముంది, అగ్గిమీద గుగ్గిలమైన జయలలిత, తనను కలిసేందుకు వచ్చిన పన్నీర్ సెల్వం అండ్ కో ను జైలు బయటే ఉంచేశారట. దీంతో సాయంత్రం దాకా జైలు బయటే పడిగాపులు కాసిన పన్నీర్ బృందం నిరాశగా వెనుదిరిగారట. అంతేకాదండోయ్, పన్నీర్ సెల్వం కేబినెట్ లోని ఓ మంత్రిని మాత్రం జయలలిత పిలిపించుకుని మాట్లాడారట. ఈ విషయం తెలిసిన పన్నీర్ సెల్వం మంత్రి మండలి దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నారట.