: తొలివన్డేకు వాన గండం!
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ కు కొచ్చి ఆతిథ్యమిస్తోంది. కేరళలో రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై కేరళ క్రికెట్ సంఘం అధ్యక్షుడు టీసీ మాథ్యూ మాట్లాడుతూ, స్టేడియంలో అద్భుతమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉందని, మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం పడినా ఇబ్బందిలేదన్నారు. తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. మైదానం చిత్తడిగా మారినా, రెండు గంటల వ్యవధిలో మ్యాచ్ కు అనువుగా తయారుచేస్తామని ధీమాగా చెప్పారు. ఇక, విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ గైర్హాజరీ నేపథ్యంలో టికెట్ల అమ్మకాల్లో కాస్త జోరు తగ్గిందని చెప్పారాయన. కాగా, ఈ మైదానం భారత్ కు అచ్చొచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ 9 వన్డేలు జరగ్గా ఆరింట నెగ్గిన భారత్ రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. మరో వన్డే వర్షం కారణంగా రద్దయింది. 1998 నుంచి ఇక్కడ వన్డే పోటీలు జరుగుతున్నాయి.