: కడపలో కలకలం రేపుతున్న కుటుంబ హత్య


కడప నగరంలో మంగళవారం వెలుగు చూసిన... ఐదుగురు సభ్యుల కుటుంబం దారుణంగా హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఏడాది కిందట కనిపించకుండా పోయిన ఈ కుటుంబం నగరంలోనే హత్యకు గురైందని మంగళవారం ఉదయం తేలింది. నగరంలోని జియాన్ పాఠశాలల యాజమాన్యానికి చెందిన కృపాకర్, భార్య మౌనిక, ముగ్గురు పిల్లలతో కలిసి ఏడాది క్రితం అదృశ్యమయ్యారు. అయితే దీనిపై మౌనిక తల్లి పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా, కేసు నమోదు కాలేదు. ఈ క్రమంలో ఆమె ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి, కుమార్తె, అల్లుడు, ముగ్గురు పిల్లలు కనపడకుండా పోయి ఏడాదవుతోందని తెలిపారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ, ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ బృందం, దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించి, ఎట్టకేలకు అదృశ్యమైన కుటుంబం నగరంలోనే హత్యకు గురైందని తేల్చింది. అంతేకాక కృపాకర్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాల ఆవరణలోనే వారి మృతదేహాలున్నాయని తెలిసి విస్తుపోయారు. ప్రస్తుతం పాఠశాల ఆవరణలో మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ హత్యోదంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ హత్యల వెనుక కృపాకర్ తండ్రి రాజారత్నం ప్రమేయం ఉన్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News