: విద్యుత్ కోసం అధిక రేటు... తెలంగాణకు తప్పడం లేదు!
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా, విద్యుత్ కొనుగోలు కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక రేట్లు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో అన్ని రంగాలనూ విద్యుత్ కోతలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో చేతికొచ్చిన పంట ఎండిపోతోందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంతమేరకైనా విద్యుత్ ను కొనుగోలు చేయక తప్పడం లేదని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై ప్రభుత్వం సంతకాలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, ఒక్కో యూనిట్ కోసం ప్రభుత్వం రూ. 8.50లను ఆయా విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించనుంది. సాధారణంగా దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా ఒక్కో యూనిట్ విద్యుత్ రూ. 3.50 లకే లభ్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఆ తరహా ఒప్పందాలు చేసుకునే వెసులుబాటు తెలంగాణ సర్కారుకు లేదు. ఉన్నపళంగా విద్యుత్ కావాలంటే, ఆ మేరకు అధిక రేట్లు చెల్లించాల్సిందే మరి. మరో మూడేళ్ల దాకా రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఇక్కట్లు తప్పవని కేసీఆర్ చెబుతున్నారు. మరి ఇకనైనా కాస్త ముందుగా ఒప్పందాలు చేసుకుంటే రాష్ట్రంపై అనవసర, అధిక భారం తప్పుతుందన్న భావన వ్యక్తమవుతోంది.