: స్మార్ట్ సిటీ అంటే ఏమిటో చాలా మందికి అర్థం కావడం లేదు: వెంకయ్యనాయుడు
విద్య, వైద్యం, ఉద్యోగాల కోసమే ప్రజలు నగరాల బాట పడుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే, వలసలు పెరిగినంత వేగంగా అభివృద్ధి మాత్రం చోటు చేసుకోవడం లేదని అన్నారు. దీంతో, నగరాల్లో మురికి వాడలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ అనగానే ఇదేంటనే సందేహాలు ప్రజల్లో మెదులుతున్నాయని... స్మార్ట్ సిటీలో సోషల్, డిజిటల్ అభివృద్ధి ఉంటుందని... ఇది జీవన ప్రమాణాలను పెంచుతుందని వెల్లడించారు. జవాబుదారీతనం. పారదర్శకత ఉన్నప్పుడు నగరాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. స్మార్ట్ సిటీలకు స్మార్ట్ నాయకత్వం, స్మార్ట్ ప్రజల సహాయ సహకారాలు కావాలని అన్నారు. సమ్మిళిత అభివృద్ధి జరిగినప్పుడే నగరీకరణ వేగవంతమవుతుందని అన్నారు. ఈ సదస్సులో సమ్మిళిత అభివృద్ధిపై చర్చ జరగడం ఆనందదాయకమని తెలిపారు. ప్రపంచ మేయర్ల సదస్సులో ప్రసంగిస్తూ వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న పదేళ్లలో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల కోసం 950 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుందని వెంకయ్యనాయుడు తెలిపారు. నగరాల మధ్య అవగాహన కోసం ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని కితాబిచ్చారు. చారిత్రక నగరంగా కీర్తి గడించిన హైదరాబాద్ అభివృద్ధిలోనూ ఎంతో ప్రగతి సాధించిందని.. దీంతో, హైదరాబాదును దర్శించేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో, రాష్ట్రాల సమన్వయంతో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వెంకయ్య చెప్పారు. స్థానిక సంస్థల్లో 33 శాతం మంది మహిళా అధ్యక్షులు ఉన్నారని... ఇది భారత్ సాధించిన ఘనత అని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలోని పట్టణాల్లో 80 శాతం మంది సొంత వాహనాలను ఉపయోగిస్తున్నారని... కేవలం 20 శాతం మంది మాత్రమే ప్రజా రవాణాను వాడుకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తామని... 80 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునేలా చేస్తామని తెలిపారు.