: బీజేపీలోకి సబ్బం హరి!
మాజీ పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే సమైక్యాంధ్ర పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇతర పార్టీల్లోని బలమైన నాయకులని బీజేపీలోకి చేర్చుకోవాలని అగ్ర నాయకత్వం అనుకుంటోంది. ఈ మేరకు, బీజేపీ అగ్రనేతలు సబ్బం హరితో ఇప్పటికే రహస్య చర్చలు జరిపినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే బీజేపీకి అనుకూలంగా హరి వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ తరపున విశాఖపట్టణం పార్లమెంట్ స్థానం నుంచి ఆయన ముందుగా బరిలోకి దిగారు. అయితే, పోలింగ్ జరగడానికి కొన్నిరోజుల ముందు బీజేపీకి మద్దతు ప్రకటించి పోటీ నుంచి వైదొలిగారు. సబ్బం హరిని తమ పార్టీలో చేర్చుకుని త్వరలో జరగనున్న విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. గతంలో, విశాఖ కార్పొరేషన్ కు మేయర్ గా పనిచేసిన అనుభవం కూడా సబ్బం హరికి ఉంది. అన్నింటికీ మించి సబ్బం హరి వెలమ(బీసీ) సామాజిక వర్గానికి చెందినవారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఈ సామాజిక వర్గానికి రాజకీయంగా చాలా ప్రాబల్యం ఉంది. సబ్బం హరికి తన సామాజిక వర్గంపై మంచి పట్టు ఉంది. దీంతో పాటు, విశాఖ పరిసర ప్రాంత్రాల్లోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ కారణంగా, సబ్బం హరిని వీలైనంత తొందరగా పార్టీలోకి చేర్చుకుని ఉత్తరాంధ్రలో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తోంది.