: ఉదయం కౌగిలించుకుంటాడు...సాయంత్రం తిడతాడు: కేసీఆర్ పై చంద్రబాబు ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలకు తానే కారణమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం టీటీడీపీ నాయకులు కేసీఆర్ విద్యుత్ కోతలపై చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ''పొద్దునపూట (అలయ్-బలాయ్ లో) కౌగిలించుకుంటాడు... సాయంత్రానికి నాపై ఏదో బురద జల్లుతాడు. ఆయన వ్యవహారశైలి నాకర్థం కావడంలేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. అదనపు విద్యుత్ కావాలని కేసీఆర్ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదని ఆయన ఈ సందర్భంగా టీటీడీపీ నేతలకు స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి తాను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి ఏపీతో పాటు తెలంగాణకు కూడా సరిపడా విద్యుత్ ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు. అసలు తెలంగాణలో విద్యుత్ సమస్యకు తానెలా కారణమవుతానని ఆయన ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేది తన కోరికని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కేసీఆర్ తనతో ప్రతిసారి కయ్యానికి కాలుదువ్వుతున్నాడని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటకీ, తెలంగాణలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.