: కేంద్ర కేబినెట్ లో అత్యంత ధనవంతుడు జైట్లీ... చివరన వెంకయ్యనాయుడు!
కేంద్ర మంత్రివర్గ సభ్యుల్లో అత్యంత ధనవంతుడైన మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అవతరించారు. రక్షణ శాఖ బాధ్యతలనూ పర్యవేక్షిస్తున్న ఆయన ఆస్తుల విలువ రూ.72.10 కోట్లు. ఇక ఈ జాబితాలో అతి తక్కువ ఆస్తితో చిట్టచివరి స్థానంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉన్నారు. సోమవారం ప్రధాన మంత్రి కార్యాలయ అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ అయిన కేబినెట్ సభ్యుల ఆస్తుల వివరాల ప్రకారం వెంకయ్యనాయుడికి కేవలం రూ.20.45 లక్షలు మాత్రమే ఉన్నాయట. ఇక ప్రధాని నరేంద్ర మోడీకి రూ.1.26 కోట్ల ఆస్తులున్నట్లు ఆ జాబితా వెల్లడించింది. ప్రస్తుతం మోడీ వద్ద రూ.38,700 నగదు, రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.1,32,698, రూ.17,00,927ల చొప్పున నగదు నిల్వలు ఉండగా, రూ.20,000, రూ.2,35,000 విలువైన బాండ్లు, రూ.1,99,031 విలువ కలిగిన ఇన్సూరెన్స్ పాలసీ, రూ.1,20,980 విలువ కలిగిన నగలు, ఖరీదైన వస్తువులున్నాయి. గుజరాత్ లోని గాంధీనగర్ లో మోడీకి రూ.1 కోటి విలువ చేసే ఇల్లు ఉంది. ఈ జాబితాలో ఆయన భార్య జసోదా బెన్ ఆస్తుల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భార్యకు సంబంధించిన కాలమ్ ఎదురుగా ‘నాట్ నోన్’ అన్న పదాలు రాసేసి సరిపెట్టారు. ఇక ప్రస్తుతం కేబినెట్ లోని 22 మందిలో 17 మంది కోటీశ్వరులే. వెంకయ్యనాయుడుతో పాటు ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా రూ.39.88 లక్షల ఆస్తుల లక్షాధికారి హోదాను దాటేలేకపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉండి, అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఆస్తులు రూ.48.54 లక్షలు మాత్రమే. ఇక హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు రూ.2.56 కోట్ల ఆస్తులుండగా, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు రూ.2.73 కోట్ల ఆస్తులున్నాయి. కేబినెట్ లో స్థానం దక్కించుకున్న ఏకైన టీడీపీ సభ్యుడు, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక జగపతి రాజుకు రూ.3.32 కోట్ల ఆస్తులున్నట్లు పీఎంఓ వెబ్ సైట్ వెల్లడించింది.