: సచిన్, కోహ్లీ బాటలో ధోనీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట భారత్ లో ఈ నెల 12న ప్రారంభం కానున్న సాకర్ లీగ్ పై భారత క్రీడావర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ వంటి క్రికెట్ ప్రముఖులు ఇప్పటికే ఈ లీగ్ ఫ్రాంచైజీల్లో వాటాలు దక్కించుకున్నారు. తాజాగా, టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా వీరిని అనుసరిస్తూ, చెన్నై ఫ్రాంచైజీకి సహ యజమానిగా అవతరించాడు. 'చెన్నయ్యన్ ఎఫ్ సీ' పేరిట ఐఎస్ఎల్ లో పాల్గొనే ఈ ఫ్రాంచైజీకి ధోనీ, బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ సహ యజమానులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఐఎస్ఎల్ పోటీలను నిర్వహిస్తున్న ఐఎంజీ-రిలయన్స్ పేర్కొంది. కాగా, ఈ లీగ్ లో సచిన్ కేరళ బ్లాస్టర్స్ కు సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఎఫ్ సీ గోవా ఫ్రాంచైజీకి కో-ఓనర్ కాగా, గంగూలీ అట్లెటికో డి కోల్ కతా జట్టుకు సహ యజమాని అన్న సంగతి తెలిసిందే. ఈ చాంపియన్ షిప్ లో పాల్గొనే జట్లలో అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటున్నారు. దీంతో, భారత్ లోని సాకర్ అభిమానులు పోటీలను ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.