: ప్రతిపక్షాలను కుక్కలతో పోల్చడమేంటి కేసీఆర్? హుందాగా వ్యవహరించు: వీహెచ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విపక్షాలను కుక్కలతో పోల్చడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుందాగా వ్యవహరించడం అలవర్చుకోవాలని కేసీఆర్ కు హితవు పలికారు. కేసీఆర్ ఇప్పటికీ ఉద్యమనేతగానే మాట్లాడుతున్నాడని, రాష్ట్రానికి ముఖ్యమంత్రినన్న విషయం గుర్తెరగాలని సూచించారు. కాగా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగాన్ని దూరదర్శన్ లో ప్రసారం చేయడాన్ని వీహెచ్ తప్పుబట్టారు. ఆర్ఎస్ఎస్ కు హిందూ మత సంస్థ అన్న పేరుందని, అలాంటప్పుడు ఆర్ఎస్ఎస్ నేత ప్రసంగాన్ని ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించారు. ఇది మతవిద్వేషాలను రెచ్చగొట్టడమేనని అన్నారు. భగవత్ ప్రసంగాన్ని ప్రసారం చేసినట్టుగా... ముస్లిం, క్రైస్తవ నేతల ప్రసంగాలను కూడా ప్రసారం చేస్తారా? అంటూ సూటిగా అడిగారు. భారతీయులందరూ ఓట్లు వేస్తేనే కేంద్రంలో బీజేపీ వచ్చిందని అన్నారు.