: ఇతర పేర్లు పెట్టుకున్న మహిళలు పతివ్రతలు కారా?: రాంగోపాల్ వర్మ
తన నూతన చిత్రం 'సావిత్రి' (శ్రీదేవిగా పేరు మార్చారు!) వివాదాల్లో చిక్కుకోవడంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా స్పందించాడు. 'సావిత్రి' పోస్టర్ పై దుమారం రేపుతున్న సంస్థలు విషయం అర్థం చేసుకోకుండా రంగంలోకి దిగాయని, దాంతో, స్పష్టత ఇచ్చేందుకే తాను ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నానని వర్మ తెలిపాడు. 'సావిత్రి' సినిమా కోసం రూపొందించిన పోస్టర్లో ఓ విద్యార్థి తన టీచర్ నాభివైపు తదేకంగా చూస్తూ కనిపిస్తాడు. ఈ పోస్టర్ చూసి కొందరు ఏదేదో ఊహించుకుంటున్నారని, సదరు టీచర్ ను చవకబారు వ్యక్తిగా భావిస్తున్నారని వర్మ పేర్కొన్నాడు. తాను చిన్నతనంలో ఓ టీచర్ పట్ల విపరీతంగా ఆకర్షితుడనయ్యానని, ఆమె పేరు సరస్వతి అని వర్మ వెల్లడించారు. చిన్ననాటి వ్యామోహం గురించి ఆమెకు చెబితే, ఓ చిరునవ్వు నవ్వి తేలిగ్గా తీసుకున్నారని చెప్పారు. కామన్ సెన్స్ ఉంది కాబట్టే ఆమె ఆ విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదని అన్నారు. సావిత్రి అంటే పతివ్రత అన్న కోణంలో ఆలోచిస్తున్న కొందరు ఈ సినిమాకు 'సావిత్రి' అని పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారని వర్మ ఆరోపించాడు. వారు భావిస్తున్న దాన్ని బట్టి, సావిత్రి అనే పేరు తప్ప మిగతా పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ పతివ్రతలు కారని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ విషయంలో స్టేట్ కమిషన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ కూడా తనకు నోటీసులు పంపిందని తెలిపాడు. 'సావిత్రి' సినిమా కథ తన జీవితానుభవం ఆధారంగా తయారు చేసింది కాదని స్పష్టం చేశాడు. ప్రస్తుత సమాజ స్థితిగతులు ఓ బాలుడిపై ఎలాంటి ప్రభావం చూపాయన్న విషయమే ఈ సినిమా కథాంశమని వివరణ ఇచ్చాడు. ఇంతకుమించి ఇతర వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. తన సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని వర్మ తెలిపాడు.