: బీజేపీ ప్రకటనల ప్రభావం గత చరిత్ర: శరద్ పవార్
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రకటనల ప్రచారం గతించిన చరిత్రేనని ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాంగ్లీలో పార్టీ నిర్వహించిన ప్రచార సభలో శరద్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ‘‘ప్రధాని మోడీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా 20 నుంచి 22 సభల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అంటే, ఆ పార్టీ మహారాష్ట్రలో బలహీనంగా ఉన్నట్లే కదా? ఈ విషయాన్ని గుర్తించినందునే పార్టీ మోడీని బరిలోకి దింపింది’’ అని పవార్ వ్యాఖ్యానించారు. ‘‘ఆరేళ్ళ పాటు మాతో పనిచేసిన సాంగ్లీ ప్రాంత ఎమ్మెల్యేలు మమ్మల్ని ఫినిష్ చేస్తామని చెబుతున్నారు. వారికి మమ్మల్ని మట్టికరిపించే సామర్థ్యమే ఉంటే, మోడీ వెంట ఎందుకెళతారు? వారి సామర్థ్యాన్ని ఎందుకు ప్రదర్శించరు?’’ అని కూడా పవార్ వ్యాఖ్యానించారు.