: అభ్యర్థుల కార్లపై జీపీఎస్ పరికరాలు... ఇది అమిత్ షా స్టయిల్!
మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రచారం వినూత్నం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలయినంతమేరకు వాడుకున్న మోడీ, దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాజాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరో అడుగు ముందుకేశారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్రచారం కోసం రంగంలోకి దిగుతున్న పార్టీ నేతలు ఏమాత్రం విశ్రమించరాదని తీర్మానించారు. మరి అందరిపై ఒకేసారి నిఘా పెట్టడం ఎలా? అందుకోసం ఆయన జీపీఎస్ పరికరాలను ఆశ్రయించారు. ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల కార్లతో పాటు, వారి కోసం ప్రచారం చేసేందుకు వస్తున్న పార్టీ నేతల వాహనాలపై ఇప్పటికే జీపీఎస్ పరికరాలు ఏర్పాటయ్యాయి. అభ్యర్థులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు?, ప్రచారం కోసం వస్తున్న నేతలు హోటళ్లలో కూర్చుంటున్నారా? లేక, ప్రచార బరిలోనే ఉన్నారా? అన్న విషయాలను ఆయన ఢిల్లీ నుంచే పర్యవేక్షించనున్నారు. మరి అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త!