: టీఆర్ఎస్, టీడీపీ పార్టీలకు 'మిస్టరీ'గా మారిన తలసాని
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు 'మిస్టరీ పర్సన్'గా మారారు. తలసాని టీడీపీని వీడి కారెక్కుతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే చాలా కాలంగా ఆయన టీడీపీ సమావేశాలకు, కార్యక్రమాలకు దూరంగా ఉంటుా వస్తున్నారు. అలాగే, ఇటీవల కాలంలో ఆయన పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు తలసాని అంగీకరించినందువల్లే, ఐడీఎల్ కాలనీ నిర్మాణానికి కేసీఆర్ హామీ ఇచ్చారని సమాచారం. ఇటీవల జరిగిన ఐడీఎల్ కాలనీ శంకుస్థాపన కార్యక్రమంలో తలసాని సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో, ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లడం లాంఛనమేనని అందరూ అనుకున్నారు. కానీ, ఈ రోజు జరిగిన టీటీడీపీ నేతల సమావేశానికి హాజరవడం ద్వారా తలసాని అందరి అంచనాలను తలకిందులు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోతానుడనుకున్న తలసాని హఠాత్తుగా ఎన్టీఆర్ భవన్ లో కనపడటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. దీంతో, అసలు తలసాని వ్యూహం ఏమిటో అర్థం గాక అటు టీఆర్ఎస్ శ్రేణులు, ఇటు టీడీపీ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.