: సంకీర్ణ ప్రభుత్వాలకు కాలం చెల్లింది: మోడీ
సంకీర్ణ ప్రభుత్వాలకు కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం నాటి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. సంకీర్ణ సర్కారు వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్న ఆయన, బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఇవ్వాలని మహారాష్ట్ర ఓటర్లను కోరారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే, బీజేపీకి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు అభివృద్ధి నిరోధకాలే కాక, ఆయా రాష్ట్రాలను అస్థిరపరిచే ప్రమాదం లేకపోలేదన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ప్రజలు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టిన వైనాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహరాష్ట్రను దేశంలోనే నెంబర్.1 రాష్ట్రంగా అభివర్ణించిన ఆయన, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనున్నాయని పేర్కొన్నారు.