: భారతీయ రైల్వేల్లో ఇక బ్రాండెడ్ ఫుడ్
భారతీయ రైల్వేలు ఆధునికత సంతరించుకుంటున్నాయి. రైళ్ళల్లో ఇప్పటివరకు అందిస్తున్న సాధారణ ఆహారం స్థానాన్ని ఇకపై బ్రాండెడ్ ఫుడ్ ఆక్రమించనుంది. ప్రయాణికులకు నాణ్యత, పరిశుభ్రతతో కూడిన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంలో భాగంగా, రైళ్ళలో బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులను అందించనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం కారణంగా ఐటీసీ, ఎంటీఆర్, మయ్యాస్, కోహినూర్ ఫుడ్స్, కెల్లాగ్స్ వంటి ప్రముఖ సంస్థల ఆహార పదార్థాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. తొలిదశలో పాంట్రీకార్లు కలిగి ఉన్న మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ళలో ఈ సదుపాయం కల్పిస్తారు. మెనూ కార్డులో 'రెడీ టు ఈట్' కేటగిరీలో ఈ బ్రాండెడ్ ఆహార పదార్ధాల జాబితా ఉంటుంది. ఈ జాబితా నుంచి ప్రయాణికులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా, వీటి ధరలను ఆయా రైల్వే జోన్లు నిర్ణయిస్తాయని ఓ అధికారి తెలిపారు. రైళ్ళలో బ్రాండెడ్ ఆహారం అందిస్తామని కేంద్రం రైల్వే బడ్జెట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.