: జేమ్స్ బాండ్ సినిమాల్లో లాంటి కంప్యూటర్లు వచ్చేస్తున్నాయ్!
జేమ్స్ బాండ్ సినిమాలు చూసే వారికి సాంకేతిక అద్భుతాల గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. జేమ్స్ బాండ్ వినియోగించే ప్రతి వస్తువు ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అతని సినిమాల్లో కంప్యూటర్లు కూడా కేవలం అతని పెదాల కదలికలను గుర్తించిన తరువాతే తెరచుకుంటాయి. శంకర్ రోబోలో కూడా రజనీకాంత్ గొంతు వింటేకానీ కంప్యూటర్ పాస్వర్డ్ తెరచుకోదు. అచ్చం సినిమాల్లోలా పెదాల కదలికను గ్రహించే కంప్యూటర్లు తొందర్లోనే అందుబాటులోకి రానున్నాయి. మనుషులు మాట్లాడేటపుడు ప్రతి ఒక్కరి పెదవుల కదలికల్లో తేడా ఉంటుందని శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో తేల్చారు. దీంతో జోర్డాన్లోని ముటా యూనివర్సిటీ పరిశోధకుడు అహ్మద్ హసానత్ పెదవుల కదలికను గ్రహించే సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఈ విధానంలో మనుషులు మాట్లాడేటపుడు నోరు, పెదాల కదలికలను కెమెరా ద్వారా గుర్తిస్తారు. మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి నోటిలో పళ్లు ఎన్ని కనిపిస్తాయి? వంటి సాంకేతిక అంశాలను కంప్యూటర్ గ్రహించి నిక్షిప్తం చేసుకుంటుంది. దీని ఫలితాలు 80 శాతం కచ్చితంగా ఉంటాయని ఆయన తెలిపారు. తద్వారా కంప్యూటర్ పాస్ వర్డ్ ఓపెన్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం కేవలం కంప్యూటర్ పాస్ వర్డ్ కోసమే కాకుండా బయోమెట్రిక్ పాస్ వర్డ్ విధానంలో కూడా వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.