: ఆమె అబల కాదు సబల... సీనియర్ పురుష రెజ్లర్ ను మట్టికరిపించింది


మల్లయుద్ధంలో పురుషులదే పైచేయిగా వస్తోంది. శారీరక ధారుడ్యం ఎక్కువగా ఉండే పురుషులే మల్లయుద్ధంలో విజేతలుగా నిలుస్తారని అందరూ భావించడం సర్వసాధారణం. కానీ ఓ మహిళా రెజ్లర్ తన యుక్తితో తనకంటే సీనియర్ రెజ్లర్ ను మట్టికరిపించి వాహ్వా అనిపించింది. రెజ్లింగ్ పోటీలు శారీరక బరువును బట్టి పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాలో ప్రతి ఏటా రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తుంటారు. గతంలో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈసారి నిర్వహించిన కుస్తీ పోటీల్లో హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రెజ్లర్లు పాల్గొన్నారు. పోటీలు ముగిసిన తర్వాత పురుష రెజ్లర్లకు నేహా తోమర్ అనే 17 ఏళ్ల యువతి తనతో పోటీ పడి గెలవాలని సవాల్ విసిరింది. అమ్మాయితో పోటీ ఏంటి? అనుకున్న పురుష రెజ్లర్లు పదేపదే ఆమె సవాలు చేస్తుండడంతో, సోనూ పహిల్వాన్ అనే రెజ్లర్ పోటీకి సిద్ధమని తెలిపాడు. వయసులోనే కాకుండా బరువులో కూడా నేహా చాలా తక్కువ. దీంతో ఆమె ఓటమి లాంఛనమే అని అంతా భావించారు. పోటీ ప్రారంభమైన తరువాత నేహా పట్టిన ఉడుంపట్టుకు సోనూ పహిల్వాన్ విలవిల్లాడాడు. దీంతో ఆమె విజయం సాధించినట్టు ప్రకటించారు. 40 ఏళ్లకు పైగా నిర్వహిస్తున్న కుస్తీ పోటీల్లో ఓ మహిళ పురుష రెజ్లర్ ను ఓడించడం ఇదే ప్రధమమని నిర్వాహకులు తెలిపారు. ఆమె ప్రతిభ అద్భుతమని అంతా ప్రశంసించారు. అంతర్జాతీయ మహిళల కుస్తీ విభాగంలో మన దేశానికి స్వర్ణపతకం ఖాయమని అంతా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News