: నేను కాదు నువ్వే సిగ్గుపడాలి... ప్రకాశ్ రాజ్ కు శ్రీనువైట్ల రిటార్ట్
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఘాటు విమర్శలకు ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల రిటార్ట్ ఇచ్చారు. తాను సిగ్గుపడాలని చెప్పిన ప్రకాశ్ రాజే సిగ్గుపడాలని ఆయన సూచించారు. 'ఆగడు' సినిమా నిర్మాణ సమయంలో వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదంతో పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై శ్రీను వైట్ల మాట్లాడుతూ సినిమా నిర్మాణంలో ఉండగా నెగెటివ్ ప్రచారం చేయడం సినిమా సక్సెస్ ను అడ్డుకోవడమేనని తెలిపారు. సినిమాలో వేసిన సెటైర్లు ఎవరినో ఉద్దేశించి వేసినవి కాదని ఆయన స్పష్టం చేశారు. 'ఆగడు' సినిమా నుంచి ప్రకాష్ రాజ్ ను తప్పించడం అహంకారం కాదని, ఆత్మాభిమానమని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా ఎలా తీయాలో, ఎలా తీయకూడదో ప్రకాష్ రాజ్ వద్ద నేర్చుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. బాగా ఆడుతున్న సినిమాపై విమర్శలు చేయడం మంచిదికాదని ఆయన హితవు పలికారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని ఆయన వివరించారు. ఆగడు సినిమాకు ముందు విడుదలైన ప్రకాష్ రాజ్ సినిమా ఏమైందో అందరికీ తెలుసని ఆయన ఆయన ఎద్దేవా చేశారు. ప్రకాశ్ రాజ్ పై ఎన్ని ఆరోపణలు ఉన్నాయో, ఆయనపై ఎన్నిసార్లు బ్యాన్ విధించారో అందరికీ తెలుసని శ్రీను వైట్ల తెలిపారు. ఇకనైనా ప్రకాష్ రాజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవడం మంచిదని శ్రీను వైట్ల హితవు పలికారు. 'ఆగడు' సినిమా పరాజయంపాలవ్వడంతో ప్రకాశ్ రాజ్ 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, తాను ఆవేదనతో చెప్పిన మాటలు శ్రీను వైట్లకు అంత కామెడీగా కనిపించాయా? అని నిలదీశారు. అయినా ఏ మాత్రం సిగ్గు, సంస్కారం లేకుండా నా మాటల్ని ఎలా సినిమాలో ఉపయోగించుకున్నాడని ఎద్దేవా చేశారు. పోనీ వాడుకున్న తరువాతైనా తనకు ఆ విషయం చెప్పేవారని, శ్రీను వైట్ల అహంకారం తగ్గించుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళతారని అన్న సంగతి తెలిసిందే.