: తెలుగు రాష్ట్రాల్లో రుణ మాఫీపై 15న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సమీక్ష
రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అమలు కానున్న రుణ మాఫీపై ఈ నెల 15న సమీక్షించనున్నారు. ఈ నెల 15న హైదరాబాద్ రానున్న ఆయన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడులతో విడివిడిగా భేటీ కానున్నారు. ఏపీలో రుణమాఫీ కోసం కొత్తగా రైతు సాధికారత సంస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సంస్థ విధివిధానాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఈ నెల 16న జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని ఉద్దేశించి కూడా రాజన్ ప్రసంగించనున్నారు.