: ఈ నెల 20 లోగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు
తెలంగాణలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉద్యోగాల భర్తీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉద్దేశించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 20 లోగా ఏర్పాటు కానుంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఛైర్మన్, పది మంది సభ్యులతో కలిపి మొత్తం 11 మందితో కమిషన్ ను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే, కమిషన్ ఏర్పాటుకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఛైర్మన్ పదవి కోసం దాదాపు 150 మంది దరఖాస్తు చేసుకున్నారని వినికిడి. అయితే తెలంగాణ అభివృద్ధిపై నిబద్ధత ఉన్న వ్యక్తికే ఈ పదవిని కట్టబెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకోని అభ్యర్థుల పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం.