: గవర్నమెంటు ఉద్యోగాలకి... సిగరెట్లతో సంబంధం!
రాజస్థాన్ ప్రభుత్వం సిగరెట్లకు ప్రభుత్వోద్యోగానికి లింకుపెట్టింది. ఇకపై రాజస్థాన్ లో ప్రభుత్వోద్యోగం కావాలంటే పొగాకు వినియోగించే అలవాటు లేకుండా ఉండాలి. ఆ అలవాటు ఉంటే ఉద్యోగం చేసేందుకు అర్హులు కారని రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో రాజస్థాన్ నిరుద్యోగులు వ్యసనాలకు దూరంగా జరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పొగాకు వాడేవాళ్ళకు, సిగరెట్లు కాల్చే వాళ్ళకు ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా తొలుత వాణిజ్య పన్నుల శాఖలో ఈ ఉత్తర్వు అమలుచేసింది. ఆ శాఖలో ఉన్న 182 ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిన రాజస్థాన్ ప్రభుత్వం దరఖాస్తుదారులకు కఠినమైన నిబంధనలు పెట్టింది. తమకు పొగ తాగే అలవాటు ఏమాత్రం లేదని, ప్రభుత్వం విధించే నియమ నిబంధనలను తాము కచ్చితంగా పాటిస్తామని చెబుతూ దరఖాస్తుదారులు ఒక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే వారి దరఖాస్తు పరిశీలించే పని లేదని స్పష్టం చేశారు.