: షారుఖ్ ఖాన్ తో చెన్నై మీడియా వాగ్వాదం
'చెన్నై ఎక్స్ ప్రెస్' హీరో షారుఖ్ ఖాన్ కు చెన్నైలో మీడియా చేతిలో చుక్కెదురైంది. వివరాల్లోకి వెళితే చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు 'హ్యాపీ న్యూ ఇయర్' ప్రమోషన్ ఈవెంట్ ఉందని, దీనికి షారుఖ్ హాజరవుతారని పీఆర్ఓ చెన్నై మీడియాకు సమాచారమందించాడు. దీంతో, చెన్నై మీడియా మొత్తం టంచనుగా సాయంత్రం 4.30గంటలకు ప్రమోషన్ ఈవెంట్ ప్లేస్ కు చేరుకుంది. అయితే, రాత్రి 8గంటలు దాటుతున్నా షారుఖ్ మీడియా సమావేశానికి హాజరవలేదు. దీనిపై, అక్కడున్నవారు కూడా మీడియాకు సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో, ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు హోటల్ రూంలో ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న షారుఖ్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, వీరిని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో షారుఖ్ బయటకు రావాలంటూ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో, ఆయన బయటకు వచ్చి తనకు మీడియా సమావేశంపై స్పష్టత లేదని, ఆలస్యానికి క్షమించాలని కోరాడు. సరైన ప్లానింగ్ లేకుండా తమను ఎందుకు నాలుగు గంటల పాటు వెయిట్ చేయించారని మీడియా ప్రతినిధులు షారుఖ్ తో వాగ్వాదానికి దిగారు. ఆలస్యానికి నిరసనగా మీడియా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.