: పవన్ కల్యాణ్, కోన వెంకట్ ల మీద సెటైర్లు వేయడానికే 'ఆగడు' తీశారా?: ప్రకాష్ రాజ్
'ఆగడు' సినిమా నుంచి తనను తప్పించడంలో ఎటువంటి తప్పులేదని, అయితే ఆ వివాదాన్ని అడ్డంపెట్టుకుని తనను తెలుగు సినిమాల నుంచి మూడేళ్ల పాటు నిషేధించాలని ప్రయత్నించడం మాత్రం తప్పని ప్రకాష్ రాజ్ అన్నారు. తనను తెలుగు సినీపరిశ్రమ నుంచి దూరం చేయవద్దంటూ ఆవేదన, ఆక్రోశం, బాధతో ప్రెస్ మీట్ లో పద్యం చెబితే, దాన్ని వెక్కిరించేలా 'ఆగడు' సినిమాలో సీన్ పెట్టుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. సినిమా విడుదల తర్వాత ఇంటర్వూల్లో తను ప్రెస్ మీట్ లో చెప్పిన పద్యం నచ్చిందని...అందుకే సినిమాలో పెట్టుకున్నానని శ్రీను వైట్ల అన్నాడని, అంటే తను బాధతో చెప్పిన కవిత శ్రీను వైట్లకు ఆనందంగా కనిపించిందా? అని ప్రశ్నించారు. ప్రేక్షకులను మెప్పించడానికి సినిమా తీయకుండా పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, కోన వెంకట్ ల మీద సెటైర్లు వేయడానికి సినిమా తీయడమేంటి? అని ఆయన నిలదీశారు. మంచి కథ చూడటానికి సినిమాలకు వస్తారు తప్ప, వేరేవారి మీద సెటైర్లు వేస్తే ప్రేక్షకులు ఆదరించరని ఆయన అన్నారు. దాసరి, బాపు, విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకులు ఎప్పుడూ ఒకరి మీద కక్షతో సినిమాలు తీయలేదని ఆయన అన్నారు. 'ఆగడు' ప్లాప్ తర్వాతైనా శ్రీను వైట్ల గుణపాఠం నేర్చుకుని ఇకనైనా మంచి సినిమాలు తీయాలని ఆయన సూచించారు. మహేశ్ బాబుతో తనది 15 ఏళ్ల అనుబంధం అని, ఆయనతో కలసి ఎన్నో సినిమాలు చేశానని, ఈ ఒక్క సినిమాలో చేయకపోవడం వల్ల నష్టమేం లేదనీ అన్నారు. ఇప్పటికైనా శ్రీను వైట్ల మారితే ప్రేక్షకులు, అభిమానులు క్షమిస్తారని ఆయన అన్నారు. 'నేను ఒక దర్శకుడిని' అనుకోవడం తప్పుకాదని... 'నేనే దర్శకుడిని' అనుకోవడమే తప్పని ఆయన వ్యాఖ్యానించారు. తాను అసిస్టెంట్ డెరక్టర్ ను చెంప మీద కొట్టిన మాట నిజమేనని, దానికి తాను సారీ కూడా చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఎందుకు కొట్టానో కారణం తెలుసుకోకుండా తనను నిందించడం సరికాదన్నారు.