: జయలలితకు శిక్షలో ఏఆర్ రెహ్మాన్ సాక్ష్యమూ కీలకమేనట!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అక్రమాస్తుల కేసులో శిక్ష పడేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సాక్ష్యమూ కీలకంగా పనిచేసిందట. తన దత్తపుత్రుడు సుధాకరన్ వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో ఏఆర్ రెహ్మాన్ తో పాటు, ఇటీవల మృతి చెందిన ప్రముఖ సంగీత విధ్వాంసుడు మాండొలిన్ శ్రీనివాస్, ఇళయరాజా సోదరుడు, సంగీత దర్శకుడు గంగై అమరన్ హాజరయ్యారు. వీరికి జయలలిత వెండి పాత్రలు, సిల్క్ వస్త్రాలు, బంగారు కుంకుమ భరిణెలు అందజేశారని నాడు వదంతులు వినిపించాయి. 18 ఏళ్ల పాటు విచారణ కొనసాగిన కేసులో భాగంగా వీరు ముగ్గురు కోర్టుకు హాజరై తమ సాక్ష్యం చెప్పారు. నాటి సంగీత కచేరీకి తాము హాజరయ్యామని, జయలలిత ఇచ్చిన వెండి, బంగారు, సిల్క్ వస్తువులు, వస్త్రాలు తీసుకున్నామని వారు కోర్టుకు చెప్పారట. వీరి సాక్ష్యాలను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికున్హా కీలకంగా పరిగణించారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యాలు, జయలలిత ఆడంబరాన్ని కళ్లకు కడుతున్నాయని, ఆమె అవినీతి సంపాదనకు ఇంతకన్నా పెద్ద సాక్ష్యాలేమీ అవసరం లేదని భావిస్తున్నానంటూ డికున్హా తన తీర్పులో ప్రస్తావించారు. ఇదిలా ఉంటే, తనకిష్టమైన భూములను చేజిక్కించుకోవడంలో జయలలిత, శశికళ ద్వారా నెరపిన చతురత కూడా ఈ సందర్భంగా వెలుగు చూసింది.