: రాజమండ్రిలో భార్యల కాళ్లకు భర్తల పూజలు... భారతీయ సంప్రదాయమంటున్న నిర్వాహకులు
దసరా నవరాత్రులను పురస్కరించుకుని రాజమండ్రి పట్టణంలో భర్తలు తమ భార్యలకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పత్ని పూజలు స్థానికంగా సంచలనం సృష్టించాయి. సంఘటన వివరాల్లోకి వెళితే, ప్రవాసాంధ్రుడు కరుణామయ స్థాపించిన 'సౌందర్యలహరి' సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రిలో సుమారు వందమంది భర్తలు తమ భార్యలకు షోడశోపచారాలతో ఖడ్గమాల పారాయణ చేస్తూ భక్తి శ్రద్ధలతో పత్ని పూజలు చేశారు. నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా టీటీడీ కల్యాణ మండలంలో వీటిని నిర్వహించారు. భార్యల పాదాల వద్ద కుంకుమతో పూజిస్తూ మెడకు గంధం రాశారు. ఇలా పూజించడం ఏ విధంగాను తప్పుకాదని, శాక్తేయ సంప్రదాయంలో భర్తలు తమ భార్యలను పూజించే విధానం ఉందని కరుణామయి మీడియాకు తెలిపారు. భార్యను పూజించడం భారతీయ సంప్రదాయమన్నారు. అవతారపురుషుడు శ్రీరామకృష్ణ పరమహంస కూడా ఆయన అర్థాంగి శారదాదేవిని పూజించారని ఆయన ఉదహరించారు. లలితా సహస్రనామాల్లో 'శివా, స్వాధీన వల్లభా', శివకామేశ్వరాంకస్థా' వంటి నామాలు పురుషునిపై శక్తి ఆధిక్యాన్ని సూచిస్తాయన్నారు.