: నెల్లూరు 3,500, వైజాగ్ 2,500... దోచేస్తున్నారు
డిమాండ్ అండ్ సప్లయ్ సూత్రాన్ని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు బాగా వంటబట్టించుకున్నారు. బతుకమ్మ, దసరా, బక్రీద్, ఆదివారం ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రైవేటు ట్రావెల్స్ పంట పండింది. హైదరాబాదు నుంచి స్వస్థలాలకు ఉద్యోగులు పయనమవుతున్నారు. దీంతో ప్రయాణికుల నుంచి ట్రావెల్స్ యజమానులు అయిన కాడికి దండుకుంటున్నారు. హైదరాబాదు నుంచి నెల్లూరుకు వెళ్లాలంటే 3,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాగే హైదరాబాదు నుంచి వైజాగ్ వెళ్లాలంటే 2,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే టికెట్ ను ట్రావెల్ సంస్థలు రిజర్వు చేసుకుని బ్లాకులో అమ్మితే అది మరింత ప్రియం. పోనీ ఆర్టీసీని ఆశ్రయిద్దామని ప్రయాణికులు భావిస్తే, ఆర్టీసీ కూడా తక్కువ తినలేదు. నాసిరకం బస్సుల్లో ఎక్కువ ధర చెల్లించి ప్రయాణం చేయాల్సి ఉంది. రైలులో ప్రయాణం మరింత దుర్భరం. రిజర్వేషన్ ఉన్నప్పటికీ బెర్తు దొరుకుతుందన్న నమ్మకం లేదు. కొన్నిసార్లు టీటీఈ రిజర్వు బోగీ నుంచి బయటకు వెళ్లిపొమ్మంటాడు. దీంతో జేబులు గుల్లవడంతో పాటు, తీవ్ర అసౌకర్యంతో ఇబ్బందులు పడాల్సివస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.