: జయలలిత కుమారుడి పెళ్లి మండపం ఖర్చే 5.21 కోట్లట!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సీబీఐ బలంగా వాదించడంతో ఆమెకు శిక్ష పడినట్టు తెలుస్తోంది. ఆమె తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత ఆమె పెంపుడు కుమారుడికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. సినిమాల నుంచి వచ్చిన జయలలిత భారీ సెట్లతో పెళ్లి వేదికను తీర్చిదిద్దారు. కేవలం పెళ్లి మండపం ఖర్చే 5.21 కోట్ల రూపాయలని సీబీఐ తెలిపింది. ఈ పెళ్లి 1995లో జరిగింది. అప్పట్లో పది రూపాయలు ఇప్పుడు 200 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే అని న్యాయస్థానానికి తెలిపారు. తాంబూలం నుంచి అతిథులకు ఇచ్చిన బహుమతుల వరకు అన్నీ విలువైనవేనని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ ఖర్చంతా ఆడపెళ్లివారే పెట్టారని చెబుతున్నప్పటికీ, అప్పటి ముఖ్యమంత్రి జయలలితే ఖర్చు చేశారని సీబీఐ సమర్థవంతంగా వాదన వినిపించింది. పెళ్లికి పిలిచిన వీఐపీ అతిథులందరికీ హోటళ్లలో ప్రత్యేక బస ఏర్పాటు చేశారని వారు న్యాయస్థానానికి తెలిపారు. ఈ లెక్కన ఆమె పెళ్లికి చేసిన ఖర్చు ఎంతై ఉంటుందో అంచనా వేయాలని వారు వివరించారని సమాచారం.