: జెట్ ఎయిర్ వేస్ లో 50% డిస్కౌంట్ ఆఫర్
విమానయాన సంస్థల మధ్య పోటీతో ప్రయాణికులకు బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో దేశీయ విమానయాన సంస్థలన్నీ విభిన్న ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జెట్ ఎయిర్ వేస్ సంస్థ కొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఎకానమీ, ప్రీమియర్ క్లాసుల్లో స్వదేశీ, విదేశీ ప్రయాణాలన్నింటికీ 50 శాతం డిస్కౌంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచింది. స్వదేశీ విమానాల్లో బేస్ ఫేర్, ఫ్యూయెల్ ఛార్జీమీద ఈ 50 శాతం డిస్కౌంట్ వర్తిస్తుండగా, అంతర్జాతీయ విమానాల్లో కేవలం బేస్ ఫేర్ మీద మాత్రమే 50 శాతం రాయితీ లభిస్తుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఈ ఆఫర్ తో ఇంతవరకు దేశీయ ప్రయాణాలకే ఆఫర్లు అందుబాటులో ఉంచే విమానయాన సంస్థలకు జెట్ ఎయిర్ వేస్ సరికొత్త సవాలు విసిరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆఫర్ లో అక్టోబర్ 6వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రయాణం మాత్రం నవంబర్ 5వ తేదీ లోపు చేయాల్సి ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్ జెట్ ఎయిర్ వేస్ తో పాటు దాని వ్యూహాత్మక భాగస్వామి ఎతిహాద్ ఎయిర్ వేస్ నడిపే విమానాలకు కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది.