: మేనకా గాంధీ నన్ను కొట్టారు: పోలీసులకు ఫిలిబిత్ న్యాయవాది ఫిర్యాదు
కేంద్ర మంత్రి మేనకా గాంధీ, తనపై చేయి చేసుకున్నారని ఫిలిబిత్ కు చెందిన న్యాయవాది ఒకరు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సొంత నియోజకవర్గ కేంద్రం ఫిలిబిత్ లో మేనకాగాంధీపై ఫిర్యాదు వచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలిబిత్ నుంచి ఎంపీగా గెలిచిన మేనకాగాంధీ నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని పట్టణానికి చెందిన న్యాయవాది వర్మ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన ఇంటివద్దకు మేనకా గాంధీ అనుచరులు బైక్ లపై వచ్చారు. ఎంపీ పిలుస్తున్నారంటూ బలవంతంగా అతడిని తీసుకెళ్లారు. అప్పటికే ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న మేనకాగాంధీ, అతడిని చూడగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండానే చేయి చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుపై విచారణ నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ చెప్పారు.