: దేశం కోసం మంచి సలహాలు, సూచనలు ఇవ్వండి... వాటిని అమలుచేస్తా: మోడీ
'మన్ కీ బాత్ పేరిట' ఆల్ ఇండియా రేడియోలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా, దేశ ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని మోడీ అన్నారు. రేడియో ద్వారా దేశంలోని మారుమూల కుగ్రామాలకు కూడా తన సందేశం అందుతుందని, అందుకే తాను ఈ మాధ్యమాన్ని ఎంచుకున్నానని మోడీ చెప్పారు. ఇకపై, రెండువారాలకోసారి, ఆదివారం నాడు రేడియోలో దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని మోడీ చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో దేశప్రజలందరూ పాల్గొనాలని మోడీ పిలుపునిచ్చారు ''మన సామర్థ్యాన్ని మనం సరిగ్గా గుర్తించాలి. మనకు శక్తి లేక కాదు..మనం శక్తిని మరిచిపోయాం. వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి. మీ ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా నాతో పంచుకోండి. దేశం కోసం ఉపయోగపడే మంచి సలహాలు, సూచనలు అందిస్తే, వాటి నుంచి నేను కూడా స్ఫూర్తి పొందుతా! కచ్చితంగా వాటిని అమలుచేస్తా. అందరం కలిసి దేశాభివృద్ధికి పాటు పడదాం'' అని మోడీ వ్యాఖ్యానించారు. పేదల శ్రేయస్సుకు ఉపయోగపడే ఖాదీ వస్త్రాలను, ఉత్పత్తులను కొనాలని ఆయన దేశప్రజలకు సూచించారు.