: జయలలిత వీఐపీ సౌకర్యాలు అడగట్లేదు: కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరు పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారట. తన హోదాకు వీఐపీ సౌకర్యాలను డిమాండ్ చేసే అవకాశమున్నప్పటికీ, ఇతర ఖైదీల్లాగే సాధారణ జీవితాన్నే గడుపుతున్నారని కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ జయసింహ చెబుతున్నారు. ‘‘జయలలిత ఎలాంటి వీఐపీ సౌకర్యాలు కోరడం లేదు. జైలులో ఆమెను ఇతర ఖైదీల మాదిరే పరిగణిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. పద్ధతిగా, హుందాగా వ్యవహరిస్తున్న ఆమె, ఇప్పటిదాకా ఎలాంటి లగ్జరీ సౌకర్యాలను కోరలేదన్నారు. వైద్యుల సూచన మేరకు ఓ ఇనుప మంచాన్ని మాత్రం జయలలిత కోరారని ఆయన వెల్లడించారు. సాధారణ జైలు శిక్ష పడ్డ జయలలిత, జైలులో సాధారణ వస్త్రధారణలోనే ఉండే వీలుందని జయసింహ చెప్పుకొచ్చారు. ఇక భోజనం విషయంలోనూ ఆమె ఎలాంటి ప్రత్యేక డిమాండ్లు చేయడం లేదని ఆయన చెప్పారు.