: తన చిత్రమున్న ప్లెక్సీని స్వయంగా తొలగించిన కేరళ సీఎం
'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని నిన్న తిరువనంతపురం, పాలయం ప్రాంతంలో ప్రారంభించిన సందర్భంగా తన చిత్రమున్న ప్లెక్సీని కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీ స్వయంగా తొలగించి ఆదర్శంగా నిలిచారు. ఒక కార్యక్రమానికి సంబంధించి తనతో పాటు ఇతరుల చిత్రాలు ఉన్న ప్లెక్సీని ఓ రాజకీయేతర సంస్థ ఏర్పాటు చేసింది. ప్లాస్టిక్ వస్తువులు, ప్లెక్స్ బోర్డులు కలిగిస్తున్న కాలుష్యానికి కళ్లెం వేసేందుకు, ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు ఆయన ఈ ప్లెక్సీని స్వయంగా తొలగించారు. కాగా ప్లెక్సీలు, బ్యానర్ల వాడకాన్ని నిషేధిస్తూ చట్టం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. వీటిని వాడవద్దని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇస్తామని కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధీరన్ తెలిపారు.