: శివసేనతో పొత్తు కొనసాగితే సంతోషిస్తా: అద్వానీ
మహారాష్ట్రలో బీజేపీతో శివసేన పొత్తు కొనసాగివుంటే తాను సంతోషించేవాడినని బీజేపీ అగ్రనేత ఎల్.కే. అద్వానీ తెలిపారు. అహ్మదాబాద్ లోని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, శివసేనతో పొత్తు చెడకుండా ఉంటే ఆనందపడతానని అన్నారు. తమ పార్టీ మరిన్ని సీట్లు అడగడం తప్పుకాదని పేర్కొన్న ఆయన, సీట్ల సర్దుబాటు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. పొత్తు విచ్ఛిన్నం గురించి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ లో చెప్పారని ఆయన తెలిపారు. అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారంలో తన జోక్యం ఉండదని స్పష్టం చేశానని ఆయన వెల్లడించారు. మిత్ర పక్షాల మధ్య భేదాభిప్రాయాలు సహజమని, అలాగని పొత్తును విచ్ఛిన్నం చేసుకోకూడదని ఆయన హితవు పలికారు.