: శ్వేత బసు ప్రసాద్ వ్యభిచారం చేయలేదా?... కేసులో కొత్త మలుపు!
సినీ నటి శ్వేత బసు ప్రసాద్ వ్యభిచారం కేసు కొత్త మలుపు తిరిగింది. ఇన్నాళ్లు ఆమెపై పుంఖాను పుంఖాలుగా వార్తలు వెలువడ్డాయి. అయితే ఆమె పట్టుబడిన బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ గదిని బుక్ చేసింది మాత్రం 'సంతోషం' పత్రిక అవార్డ్స్ నిర్వాహకులు అని తేలింది. ఈ విషయాన్ని పోలీసులు శ్వేత బసు ప్రసాద్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. శ్వేత బసు ప్రసాద్ కూడా న్యాయస్థానం ముందు ఇదే విషయాన్ని నిర్థారించింది. ఈ మేరకు ఆమె వాంగ్మూలాన్ని వీడియో ఫైల్ గా రికార్డు చేశారు. అందులో తాను గ్రాడ్యుయేషన్ విద్యార్థినని, 'సంతోషం' అవార్డ్స్ ఫంక్షన్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు హోటల్ కు వచ్చానని ఆమె న్యాయస్థానానికి తెలిపింది. తనను పోలీసులు అన్యాయంగా వ్యభిచారం కేసులో ఇరికించారని శ్వేత బసు ప్రసాద్ వాపోయింది. దీంతో డిఫెన్స్ న్యాయవాది ప్రదీప్ కుమార్ తన వాదనలో ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. వ్యభిచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని శ్వేత బసు ప్రసాద్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని చెప్పిన పోలీసులు, దానిని నిరూపించేందుకు సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ నిర్వాహకులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు. దీంతో కేసు కొత్త మలుపు తిరగడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో బాలీవుడ్ నుంచి శ్వేత బసు ప్రసాద్ కు మద్దతు తెలిపిన వారు కూడా ఇదే విషయాన్ని సూచించిన సంగతి తెలిసిందే.