: భారత్ మార్కెట్ లోకి అమెజాన్ ప్యాకేజ్డ్ ఫుడ్స్!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్, తన భారత వినియోగదారులకు ప్యాకేజ్ట్ ఫుడ్స్ ను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీపావళి కంటే ముందుగానే ఈ కొత్త తరహా సేవలు భారత మార్కెట్ లో అడుగుపెట్టనున్నాయి. ఇప్పటికే కోకా-కోలా జీరోను తన ఫ్లాట్ ఫాం పై అమెజాన్ ఆపర్ చేస్తోంది. వచ్చేవారం తన వినియోగదారులకు కోకా-కోలా జీరోను అమెజాన్ డెలివరీ చేయనుంది. కొత్త గా ప్రవేశపెట్టనున్న పథకం పూర్తిగా కార్యరూపం దాలిస్తే, దాదాపు వంద రకాల ఆహార పదార్థాలను అమెజాన్.కామ్ కు ఆర్డర్ చేసి, ఇంటివద్దే కూర్చుని లాగించేయొచ్చు. అయితే దీనిపై అమెజాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్యాకేజ్డ్ ఫుడ్స్ రంగంలో ఉన్న కెల్లాగ్, కార్నిటో తదితర కంపెనీలతో అమెజాన్ జరుపుతున్న చర్చలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయని సమాచారం. మరోపక్క, ప్యాకేజ్డ్ ఫుడ్స్ రంగంలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెట్టలేమని ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఇటీవలే చెప్పారు. అయితే ఈ రంగానికి సంబంధించి భారత్ లో అపార అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాలను కొల్లగొట్టేందుకు అమెజాన్, అందరికంటే ముందు రంగంలోకి దిగనుంది.