: బ్యూరోక్రాట్లూ... బుర్రలకు పదును పెట్టండి: ఐఏఎస్ లకు కేంద్రం ఆదేశం
ప్రభుత్వ పథకాల అమలులోనే కాక వాటి రూపకల్పనలోనూ కీలక భూమిక పోషించాల్సిన ఐఏఎస్ అధికారుల్లో నానాటికీ సత్తా తగ్గిపోతోంది. అంతగా పాలనానుభవం లేని మంత్రుల మాటలకు గుడ్డెద్దుల్లా తలాడిస్తూ, చెప్పిన పని చేసుకుపోతున్నారు తప్పించి, కొత్త పథకాల రూపకల్పనకు ఆసక్తి చూపడం లేదు. అంతేకాక క్రమంగా పాలనపై పట్టు కూడా కోల్పోతున్నారు. దీనిపై మోడీ ప్రభుత్వం లోతుగా దృష్టి సారించింది. సీనియర్ అధికారులను పనిలోకి ఎలా పంపాలి? అంటూ సుదీర్ఘంగా ఆలోచించిన ప్రభుత్వం, ఓ కొత్త ఐడియాతో తన పని మొదలుపెట్టింది. అనుకున్నదే తడవుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం... ఏటా ఐదు రోజుల పాటు నిర్వహించే మేధోమథన సదస్సుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొనాలి. తోటి ఐఏఎస్ లతో భేటీ కావాలి. అనుభవాలను పంచుకోవాలి. బుర్రలకు పని పెట్టాలి. కొత్త ఆలోచనలతో బయటకు రావాలి. ప్రభుత్వంలో ఆ కొత్త ఆలోచనలతో సరికొత్త పథకాలు, సరికొత్త పరిష్కార మార్గాలను కనిపెట్టాలి. ఇదీ, తాజాగా కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల సారాంశం. మరి, బద్ధకం నేర్చిన బ్యూరోక్రాట్లు తమ బుర్రలకు పదును పెట్టేందుకు ఒప్పుకుంటారో, లేదో చూడాలి.