: ఇంధన ఖర్చులు తగ్గించుకోండి: ఢిల్లీ పోలీసులకు పీఎంఓ ఆదేశాలు
ఢిల్లీ పోలీసు బాసులు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తున్నారట. దీంతో పోలీసు శాఖకు ఇంధన ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఏటికేడు ఈ వ్యయం కొండలా పెరుగుతుండటంతో ఏకంగా ప్రధాని కార్యాలయమే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇకపై ఇంధన వ్యయాలను తగ్గించుకోవాల్సిందేనని ఢిల్లీ పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ప్రధానంగా పోలీసు ఉన్నతాధికారులు అధికారిక విధులకే కాక వ్యక్తిగత పనులకు కూడా ప్రభుత్వ వాహనాలను విరివిగా వినియోగిస్తున్నారు. దీనిపై ఇదివరకే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అయినా పోలీసు బాసులు స్పందించిన దాఖలా కనిపించలేదు. దీంతో ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అధికారిక కార్యక్రమాలకు కాకుండా వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనాలను వాడే పోలీసు బాసులకు, ఇకపై ప్రభుత్వ వాహన సౌకర్యం లేకుండా చేస్తామని కూడా ప్రధాని కార్యాలయం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.