: జైల్లో జయ సాధారణ భోజనమే చేస్తున్నారట!
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సాధారణ భోజనాన్నే స్వీకరిస్తున్నారట. జైలు అధికారులు పెట్టే భోజనాన్ని తిరస్కరిస్తున్న జయలలిత, బయటి నుంచి భోజనాన్ని తెప్పించండంటూ జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదట. జైల్లోని మిగతా ఖైదీల మాదిరే జయలలిత కూడా తాము అందించే ఆహారాన్నే భుజిస్తున్నారని సాక్షాత్తు జైలు అధికారులే వెల్లడిస్తున్నారు. ఒకటి లేదా రెండు చపాతీలు, బ్రెడ్, పాలు, బిస్కెట్లను జయలలిత తీసుకుంటున్నారని ఓ జైలు అధికారి వెల్లడించారు. అంతేకాక జయలలిత జైలులో ఆరోగ్యంగానే ఉన్నారని కూడా ఆయన తెలిపారు. తామిచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న జయలలిత, బయటి నుంచి ఆహారం తీసుకురమ్మని తమకు ఆదేశాలు జారీ చేయడం లేదని కూడా సదరు అధికారి తెలిపారు. జయలలిత జైలు జీవితం గురించి బయట జరుగుతున్న ప్రచారం మొత్తం కల్పితమని ఆ అధికారి చెప్పుకొచ్చారు.