: మోడీ కలల ప్రాజెక్టు 'స్వచ్ఛ్ భారత్'కు నేడు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోడీ మరో కలల ప్రాజెక్టు 'స్వచ్ఛ్ భారత్ అభియాన్'కు నేడు అంకురార్పణ జరుగుతోంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మోడీ ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశ రాజధానిలోని పారిశుద్ధ్య కార్మికులు నివసించే వాల్మీకీ సదన్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో మోడీ స్వయంగా పాల్గొంటారు. ప్రధాని కార్యాలయం ఆదేశాల నేపథ్యంలో దేశ రాజధాని సహా దేశవ్యాప్తంగా 30 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆయా రాష్ట్రాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడు, అశోక్ గజపతి రాజు తదితరులు ఇప్పటికే చీపురు చేబట్టి ఈ కార్యక్రమ ఆవశ్యకతను వివరించే యత్నం చేశారు. స్వతంత్రం కన్నా పరిశుభ్రత ముఖ్యమని నాటి స్వాతంత్ర్య పోరులో మహాత్మా గాంధీ చేసిన సూచనల ఆధారంగా మోడీ, ఈ కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు.